ఉత్పత్తి కులాల దిక్సూచి 'ది శూద్రాస్"

ఉత్పత్తి కులాల దిక్సూచి 'ది శూద్రాస్"
                   వేల సంవత్సరాలుగా భారత సామాజిక వ్యవస్థలో కొన్ని వర్గాలు మరికొన్ని వర్గాల మీద నిరంతరాయంగా ఆధిపత్యాన్ని వహించడం అసమానతలను ప్రస్పూటకరించడమే అవుతుంది. ఈ సామాజిక అసమానతలను ధిక్కరించడం దీర్ఘకాలం సంభవించే ప్రక్రియ. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న శూద్రులను విముక్తి చేసే పోరాటంలో జ్యోతిభాపూలె ఏకంగా వర్ణ వ్యవస్థనే  ధిక్కరించాడు. ఆయన అడుగుజాడలల్లో నడిచిన అంబేడ్కర్ సైతం సామాజిక అసమానతలను ప్రశ్నించాడు. అంబేడ్కర్ అనంతరం బ్రాహ్మణీయ హిందూ వ్యవస్థ దాష్ఠికాల మీద తన కలం ఎక్కుపెట్టిన సామాజిక, రాజకీయ తత్వవేత ప్రొఫెసర్ కంచ ఐలయ్య, జే ఎన్ యూ పరిశోధక విద్యార్థి కార్తిక్ రాజా కరిప్పుసామి సంపాదకీయంలో వెలువడిన పుస్తకం 'ది శూద్రాస్: విజన్ ఫర్ ఎ న్యూ పాత్".  ఆధునిక కాలంలో సైతం కులం, మతం పేరిట సమాజాన్ని విడదీస్తున్న అభివృద్ది నిరోధక శక్తుల అరాచకత్వంపై ఎక్కుపెట్టిన అస్త్రమిది. ముందస్తు పరిచయ  వ్యాసంతో కలిపి పన్నెండు వ్యాసాలున్న ఈ పుస్తకం ఆధ్యాంతం ఆలోచింప జేసే విధంగా భారత సమాజంలో శూద్రుల వెనకబాటు తనంతో పాటు, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులను భిన్న కోణంలో మన ముందుంచుతుంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న విభిన్న సమస్యల గురించి ఈ పుస్తకంలోని వ్యాసాలు పాఠకులకు అవగాహన కల్పించడంతో పాటు, శూద్ర సమస్యను ఆధునికవాద విధానంతో దేశం ముందు ఉంచాయి. చారిత్రాత్మకంగా నాగరికత ప్రాతిపదికన నిర్మించిన అనేక ఉత్పాదక కులాలు శూద్ర వర్గంలో భాగమే. అయినప్పటికీ బ్రాహ్మణీయ క్రమంలో శక్తి, జ్ఞానం పంచుకునే అమరిక పరంగా ఈ వర్గం అట్టడుగు స్థానంలో ఉంది. వ్యవసాయ ఆధిపత్య కులాలు, వెనుకబడిన కులాలు, ఇతర వెనుకబడిన కులాలు, చాలా వెనుకబడిన కులాలు వంటి అనేక పేర్లతో ఈ వర్గం పిలవబడుతోంది.  కులవ్యవస్థ భావజాలం సమానత్వ సమాజం అనే భావనకు ప్రాథమికంగా విరుద్ధమని, అటువంటి సమాజ సాక్షాత్కారం స్వభావం, పరిస్థితులు పరిమితుల నుండి ఉత్పన్నమవుతుందని "హోమో హైరార్కికస్" పుస్తకంలో లూయీ డ్యుమాంట్ పేర్కొన్నాడు. కుల వ్యవస్థను 'సామాజిక స్తరీకరణ'కు రూపంగా మాత్రమే అర్థం చేసుకోవడానికి మనల్ని మనం పరిమితం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశాడు.
                బాబాసాహెబ్ అంబేడ్కర్ 1946లో మొదటిసారిగా 'శూద్రులు ఎవరు" ? అనే పేరుతో ప్రచురించిన పుస్తకం శూద్రుల అస్థిత్వంపై మొదటిసారిగా స్పూర్తిధాయక ప్రశ్నలను సంధించింది. ఇన్నేళ్ళ తరువాత "ది శూద్రాస్" దళిత బహుజనులలో అదేరకమైన స్పూర్తిని రగిలిస్తోంది. వేద కాలంలో పట్టణ నాగరికత లేదు. ఈ కాలంలో మతసంబంధమైన ఆర్థిక వ్యవస్థ సమాజాన్ని శ్రేణీకృత వర్ణాలుగా విభజించింది. శూద్రులు వ్యవసాయదారులు, పశువుల పెంపకందారులుగా, వైశ్యులు పర్యవేక్షకులుగా కనిపిస్తారు. బ్రాహ్మణులు, క్షత్రియులు కూడా ఉత్పత్తి సంబందిత వ్యాపకలకు, వ్యవసాయ, పశువుల పెంపకం పనులకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏదేమైనా, ద్విజా (రెండుసార్లు జన్మించిన) కులాలు అని పిలువబడే ఈ మూడు కులాలు హిందూ మతంలో అనేక హక్కులను పంచుకున్నాయి. హిందూ సమాజంలో శూద్రులకు ప్రాథమిక హక్కులు లేనప్పటికినీ, వారిని అదే మతానికి చెందినవారని ద్విజులు ప్రకటించారు.  అదేసమయంలో వారికి ఆధ్యాత్మిక పౌరసత్వం, దాని తాత్విక ఉపన్యాసంలో స్థానాన్ని నిరాకరించారు. పార్లమెంట్ సభ్యుడు శరద్ యాదవ్, సామాజిక కార్యకర్త సునీల్ సర్దార్, న్యాయ నిపుణులు బిందూ దొడ్డహట్టి, జామియా మిలియా ఇస్లామియా ప్రొఫెసర్ అరవింద్ కుమార్, జే ఎన్యూ రీసర్చ్ స్కాలర్ ఓం ప్రకాశ్ మహతో, సామజిక కార్యకర్త ప్రాచీ పాటిల్, జర్నలిస్ట్ ఉర్మిలేశ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రాం షేఫర్డ్ భీనవేణి, సీనియర్ వైద్య నిపుణుడు వినయ్ కుమార్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థి పల్లికొండ మణికంఠ వంటి శూద్ర నేపథ్య వ్యాసకర్తలు అందించిన వ్యాసాలు ఈ పుస్తకం ఉద్దేశానికి బలాన్నందించాయి. చరిత్ర వివిధ దశలలో శూద్రుల పరిస్థితిని వివరించడానికి సరైన అధ్యయనాలు లేవు. ఈ వ్యాసాలలో వారి సమకాలీన స్థితిగతులు.., మరీ ముఖ్యంగా భారతీయ సమాజంలో వారి స్థానాన్ని చర్చించారు. ప్రస్తుతం శూద్రుల పరిస్థితి దుర్భరంగా ఉన్నదని, శూద్ర విముక్తే ప్రధాన లక్ష్యంగా భవిష్యత్తులో శూద్ర విప్లవ ఆవశ్యకతను ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది.
               ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలంలోనూ శూద్రులపై జరుగుతున్న అత్యాచారాలకు అంతు లేకుండా పోయింది. ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వ సాధన కోసం శూద్రులు చేయవలసిన పోరాటాల ఆవశ్యకతను ఈ పుస్తకం వివరిస్తుంది. నిరాధరణకు గురైన శూద్ర సంస్కృతి, సాంప్రదాయాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పింది. శూద్రులకు దేశ విదేశాలలో కూడా ఎటువంటి స్నేహసంబంధాలు లేనందున వారి అస్థిత్వ పోరాటం వారే చేయాలి. వైధిక ధర్మం శూద్రులను కేవలం ఉత్పాధక కార్యక్రమాలకే పరిమితం చేసి పేదరికాన్ని, బలవంతపు బానిసత్వాన్ని అనాధిగా అంటగడుతూనే ఉంది. బ్రాహ్మణియ వర్గీకరణ ప్రకారం, అంటరానివారితో సహా శూద్రులనబడే అన్ని ఉత్పాదక కులాలు శ్రమించేందుకే ఉద్దేశించబడినవి. కానీ ఈ ఉత్పాదకత ఫలాలను మాత్రం ద్విజా కులాలు స్వాధీనం చేసుకున్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఈ దోపిడీ వ్యవస్థ తొలి క్రమబద్ధమైన చరిత్రను అందించింది. ద్విజులు ఉత్పాదక శ్రమకు దూరంగా ఉండటానికి, శూద్రుల ఖర్చుతో సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అర్థశాస్త్రం సైద్ధాంతిక పునాది వేసింది.  అన్ని రకాల శ్రమతో కూడిన పనులను చేయడం ద్వారా ద్విజ వర్ణాలకు సేవ చేయడమే శూద్రుల ఏకైక విధి అని మనువు తెలివిగా ఆదేశించాడు. ఈ అన్యాయం అనాధిగా కొనసాగుతూ ఆదర్శవంతమైన వర్ణశ్రమధర్మంగా కొనియాడబడుతోంది. ద్విజులు సంస్కృతం, వేదాల అధ్యయనాలను ఇంకా తమ ఆధీనంలో ఉంచుకుంటూనే శూద్రులను హింసాత్మక వివక్షకు గురి చేస్తున్నారు. ఆధిపత్య కులాలుగా భావించబడే ఎగువ శూద్రులైన జాట్లు, గుజ్జర్లు, పటేల్స్, యాదవులు, మరాఠాలు, నాయరా, రెడ్డిలు, కమ్మలు, గౌండర్లు, లింగాయత్‌లు తమ మోధో స్పృహను మరిచి మనువాద రాజకియాలకు బలైతే శూద్రుల పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయమని ఈ పుస్తకం హెచ్చరిస్తోంది.
                     ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న జ్యోతిభాపూలే శూద్రులు, అతిశూద్రుల మీద షేఠ్ జీ - భట్ జీ(బ్రాహ్మణ-బనియా)ల సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని నిరసించాడు. దక్షిణాదిన పెరియార్ రామస్వామి, అయోతి దాస్ లు బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు భవిష్యత్తులో శూద్ర అస్థిత్వా పోరాటాలకు స్పూర్తిదాయకమయ్యాయి. స్వాతంత్రానికి ముందు నుంచే పశ్చిమ, దక్షిణ భారత దేశంలో బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ అనేక అస్థిత్వ ఉద్యమాలు మొదలు కావడం సదరు ప్రాంతాల ఆత్మ గౌరవానికి నిదర్శనం. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదల్ పార్టీల ఆవిర్భావానికి ముందు హిందీ మాట్లాడే ఉత్తర, తూర్పు భారతంలో ఈ అస్థిత్వ పోరాటాలు తక్కువే అని చెప్పవచ్చు. విద్య, ఉపాధి పరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోగా, కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్,బిజేపి రెండింటి పాలనలోనూ రిజర్వేషన్ల అమలు పట్ల స్పష్టమైన చర్యలు  లేకపోవడం దీనికి నిదర్శనం. 'కులరహిత' సమాజ ద్యేయంగా ప్రకటనలు గుప్పించిన భారతదేశ ఆధునిక ద్విజ సమాజం మండల్ కమిషన్ ప్రకటన సందర్భంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. మండల్ కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం తీసుకు రావడం ఈ ఒత్తిడి ఫలితమే. రాబోయే ప్రమాదాన్ని దళిత, ఆదివాసీలు తెలివిగా అర్థం చేసుకున్నప్పటికీ, శూద్ర ప్రాంతీయ పార్టీ నాయకులు, క్యాడర్లతో సహా చాలా మంది శూద్రులు అర్థం చేసుకోలేదు. చాలా విషాదకరంగా, ఆధునిక భారతీయ చరిత్రలో ఉన్నత కుల ముస్లిం మేధావులు కూడా కులం, ఆధ్యాత్మిక ద్విజుల గురించి వ్రాయలేదు. ఇదేసమయంలో ఫులే-అంబేద్కర్ భావజాలం ప్రజాస్వామ్య, రాజ్యాంగ రూపాల పోరాటాలకు నిబద్ధతను కలిగి, అన్ని రకాల వ్యవస్థీకృత హింసపై పోరాటం చేస్తుంది. శూద్రులలో విద్యాధికులు కూడా తమను తాము శూద్రులుగా చెప్పుకోవడానికి ఇష్టపడక పోవడం విషాధం. తమ శూద్ర అస్థిత్వమే తమ పాలిట శాపంలా పరిణమించి విద్య, ఉద్యోగావకాశాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనని వారి భయం. శూద్రులు, దళిత, ఆదివాసులు తమ అభ్యున్నతి కోసం లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామ్య పాఠ్యాంశాలతో ప్రాంతీయ భాషలను నేర్చుకోవడంతో పాటు, ఆంగ్ల మాధ్యమంలో ఉన్నత విద్య చదవవలసిన ఆవశ్యకత ఉంది. శూద్రులకు ఆంగ్ల విద్య నేర్చుకోవడానికి పెద్దగా సదుపాయాలు, వనరులు లేవు. కొంతవరకు చారిత్రక ప్రతికూలత, మరికొంతవరకు ఉన్నత విద్యలో మండల్ కమిషన్ యొక్క సిఫారసులను పూర్తి స్థాయి అమలుపరుచకపోవడం కూడా కారణమేనని వ్యాసకర్తల అభిప్రాయం. ఆధిపత్య నియంతృత్వాలను ఎదిరించడంలోనే శూద్రుల అస్థిత్వం ఆధారపడి ఉందనే వాస్తవాన్ని ఈ పుస్తకం లోతుగా విశ్లేషించింది.  
                                                                                  #జయప్రకాశ్_అంకం...

No comments:

Post a Comment

All Updates

TSLPRB Updates

TET DSC Gurukula Updadtes

Job Notifications

Important Links

Centran Jobs Updates

TSPSC VRO FInal Merit Lists and Cut off Marks

Important Links

TSPSCvro District wise Reservation wise Marks and Merit lists

Top