ఆ దేశంలో ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు. ఏ చిన్నారీ భుజాన పుస్తకాల సంచీతో ఆపసోపాలు పడుతూ కనిపించదు. యూనిఫాంలూ, హోం వర్కులూ, వార్షిక పరీక్షలూ, మార్కులూ, ర్యాంకుల బూచీలూ, రోజంతా సాగే స్కూళ్లూ, స్టడీ అవర్లూ, ట్యూషన్లూ... ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కష్టం కలిగించే ఏ చిన్న విధానాన్నీ అనుసరించని ఏకైక దేశం #ఫిన్లాండ్. అయితేనేం, ప్రపంచంలోని అత్యద్భుతమైన విద్యావ్యవస్థల్లో ఆ దేశానిది నిలకడగా తొలిస్థానమే. అక్కడ ప్రతి విద్యార్థీ తరగతిలో టాపరే! పిల్లల్ని స్కూలుకి పంపించేముందు తల్లిదండ్రులూ, పాఠాలు మొదలుపెట్టే ముందు టీచర్లూ... ఫిన్లాండ్ వాసులు అనుసరిస్తోన్న పద్ధతుల్ని ఓసారి స్మరించుకోవడం మహా ఉత్తమం.
పదిలోపు వంద ర్యాంకులు, వందలోపు వెయ్యి ర్యాంకులు, వెయ్యిలోపు పదివేల ర్యాంకులు... మే, జూన్ నెలల్లో ఏ టీవీ ఛానల్ పెట్టినా అదే పనిగా ఈ అంకెల దండోరా చెవుల్ని హోరెత్తిస్తుంది. ఏ పత్రిక తిరగేసినా స్కూళ్లూ, కాలేజీల ప్రకటనలతో నిండుంటాయి. మంచి మార్కులొచ్చిన పిల్లలే పోటీ ప్రపంచానికి మనుషుల్లా కనిపిస్తారు. టాప్ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. సచిన్‌లా బ్యాటింగ్ చేసే శక్తి ఉన్నా, రెహమాన్‌లా పియానో వాయించేంత టాలెంట్ సొంతమైనా, తరగతిలో మార్కులు రాకపోతే మాత్రం ఆ పిల్లాడు ఎందుకూ పనికిరాని మొద్దావతారమే! అందుకే మనదేశంలో చాలామంది చిన్నారులు ఆ అంకెల వేటలో పడి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. ఓ పది మార్కులు తగ్గితేనే మహా పాపం చేసినట్టు ప్రాణాలు తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆరాటం, విద్యా సంస్థల ఒత్తిడీ కలగలిసి ఇక్కడ విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి. ఉత్తమ విద్యావ్యవస్థల జాబితాలో నానాటికీ మన స్థానం దిగజారుతూ వస్తోంది.
సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించినా మనలాంటి ఎన్నో దేశాలు సాధించలేని ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్, ఆడుతూపాడుతూ అందుకుంటోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ‘ఫిన్లాండ్’ విద్యార్థులపైన ఏ మాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దొచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ, ఇతర వృత్తి నిపుణులుగా తయారు చేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలకు కూడా, పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతుల్ని మార్చుకుంటూ, కొత్త ప్రమాణాల్ని అందుకుంటూ గత నలభై ఐదేళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తొంది. మూడేళ్లకోసారి అంతర్జాతీయంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎసెస్‌మెంట్’(పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్, చైనా లాంటి దిగ్గజాలను దాటి ఆ చిట్టి దేశానికి చెందిన పిల్లలు వరసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్ సొంతం.
ఏడేళ్లకు స్కూలు...
మన దేశంలో పిల్లలకు రెండేళ్లు దాటగానే తల్లిదండ్రులు స్కూళ్ల వేట మొదలుపెడతారు. బడిలో కాలు పెట్టకముందే అఆలూ, అంకెలూ బట్టీ కొట్టిస్తారు. కానీ ఫిన్లాండ్‌లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే. అప్పటివరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్ సెంటర్లలో ఉంటూ తమ మెదడుని పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకుంటాయి. దేన్నైనా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్ లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా, పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయ పడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్పృహ... ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు, కానీ మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలన్నది ఫిన్లాండ్ వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దానికోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పనిలే'దంటారు అక్కడి ఉపాధ్యాయులు
చదువంతా #ఉచితం
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే గొప్పదిగా ఎదుగుతుందన్నది ఫిన్లాండ్ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే భుజాన వేసుకుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్ సెంటర్‌లో కాలుపెట్టినప్పట్నుంచీ పాతికేళ్ల తరవాత యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత విద్యను అందిస్తోంది. ప్రైవేటు పాఠశాలలూ, ప్రైవేటు యూనివర్సిటీల ప్రస్తావనే అక్కడ కనిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందుతుంది.
ఆరేళ్లదాకా ఆడుతూపాడుతూ...
స్వెటర్లూ, ఉయ్యాలా, ఉగ్గు గిన్నె... పసిపిల్లల తల్లిదండ్రులకు ఎవరైనా ఇలాంటి చిరు కానుకలిస్తారు. ఫిన్లాండ్‌లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేప్పుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే, తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని మహిళలకు అందిస్తాయి. ఆ తరవాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్లపాటు ‘డే కేర్ ఎలొవెన్స్’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరవాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరకి రావు. పక్షులూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం... ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ, ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులుంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. అంటే... అక్కడన్నీ మంచి స్కూళ్లే!
రోజూ ఒంటిపూట బడులే...
ఏడేళ్ల వయసు నుంచీ పదహారేళ్ల వరకూ, అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకొని తీరాలన్నది ఫిన్లాండ్‌లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరూ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటిమీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల(యూనిఫాం) విధానాన్ని ఎప్పుడో పక్కనపెట్టారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్’ సంస్కృతినీ దూరం చేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్‌ని పూర్తిచేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదన్నది మరో నిబంధన. పిల్లల నిద్రకు ఫిన్లాండ్ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరవాతే తెరుచుకుని, మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్ పూర్తయ్యేదాకా అక్కడ పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్‌కీ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించీ తల్లిదండ్రులు బెంగపడాల్సిన పనిలేదు. చదువు పూర్తయ్యేదాకా చక్కని పోషకాహారాన్ని- పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతి రోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.
ర్యాంకులకు చెల్లు!
‘అందరూ సమానంగా చదవాలీ, అందరూ టాపర్లు కావాలీ’ అన్నది ఫిన్లాండ్ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తి చూపే పరీక్షలూ, మార్కుల సంస్కృతికి ఆ దేశం పూర్తిగా దూరమైంది. అన్ని దేశాల్లోలా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు వేధింపులుండవు. ఒక్కో తరగతిలో 15-20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలూ, సబ్జెక్టులపైన పట్టూ లాంటి అన్ని అంశాల గురించీ టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ, ఏటికేడూ వాళ్లని మెరుగుపరచడానికి కావల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివర్లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయట పెట్టరు. అంటే... పరీక్షలు రాసేది విద్యార్థులైనా, వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాల్ని పిల్లలు ఏమేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్ విద్యా విధానం సాగుతుంది.
ఒకే ఒక్క పరీక్ష!
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలీకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్ చివర్లో తమ జీవితంలో తొలి ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పైచదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్ విద్యావ్యవస్థలో కనిపించవు. పైతరగతుల్లో, రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్‌కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్ తరవాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునేవాళ్లు ‘అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్’ కాలేజీల బాట పడతారు. చదువుపైన ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ తీసుకొని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యేవరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన అగత్యం పిల్లలకూ ఉండదు.
టీచరే సూపర్‌స్టార్!
‘బతకలేక బడిపంతులు’ అన్న నానుడిని ఫిన్లాండ్‌లో ‘బతకాలంటే బడిపంతులే’ అని మార్చుకోవాల్సిందే! ఆ దేశంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరవాతి స్థానం ఉపాధ్యాయుడిదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్‌లో బోధన ఓ ‘స్టార్ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్‌గా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్నుంచే దానికోసం కసరత్తు మొదలుపెడతారు. కానీ ఆ ఉద్యోగం పొందడం అంత సులువైన పనికాదు. ఓ ఆర్నెల్లు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్‌గా మారిపోదాం అంటే కుదరదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్‌గా చేరాలంటే కనీసం మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్ టీచర్లకైతే పీహెచ్‌డీ తప్పనిసరి. ఏటా టీచర్ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పదిశాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడపడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందర్ని ఎంపికచేస్తారు. ఆ తరవాతి దశ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన ప్రేమతో ఆ వృత్తిలో అడుగుపెట్టేవాళ్లనే చివరికి ఎంపికచేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఆ ప్రక్రియ మన సివిల్ సర్వీసు అభ్యర్థుల ఎంపికకు ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశల్ని దాటొస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లలకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్కృతి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్-టీచర్’ సమావేశాలకూ చోటు లేదు. ‘లెస్ ఈజ్ మోర్’ అన్నది ఫిన్లాండ్ ప్రజల జీవన సూత్రం. అందుకే పసిమెదళ్లపైన గుది బండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ల విధానాలూ, టాపర్లూ-మొద్దులూ అన్న తారతమ్యాలూ, పేదా-గొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ-చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలూ-పట్టణాలూ అన్న వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే, వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా అనుసరిస్తున్నారు. పాఠ్య పుస్తకాన్ని చేతిలో పెట్టడానికి ముందే పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు పునాది వేస్తున్నారు. మంచి విద్యార్థులనూ, పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు.
అక్షరాస్యతలో నంబర్ 1
గతేడాది కనెక్టికట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలిస్థానం ఫిన్లాండ్‌ది (100శాతం). చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ దానికి తొలి స్థానం దక్కింది.
* తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థులకంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒక టీచర్ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతే వాళ్లకు తెలీదు.
* ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలూ, స్కూళ్లకు ఎక్కువ సెలవులూ ఉన్న దేశం ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్‌లో దాదాపు 240 రోజులపాటు తెరిచుంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1700 గంటలు. అంటే ఫిన్లాండ్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
* భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీ లాంటి కొన్ని సబ్జెక్టులను ఈ ఏడాది నుంచి ఫిన్లాండ్ హైస్కూళ్లలో తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుత తరంలో జోరు మీదున్న రెస్టరెంట్లూ, జిమ్‌లూ, స్టార్టప్‌ల లాంటి సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.
* ఫిన్లాండ్‌లో స్కూల్ సిలబస్‌ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాతవాటిని తొలగిస్తూ ఉంటాయి.
* ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాల్ని ప్రచురించే దేశం ఫిన్లాండే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలని అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ, వాటి కింద సబ్‌టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఆ పద్ధతి.
* పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్ పిల్లలకు ఇంగ్లిష్ పాఠాలు మొదలవుతాయి. అప్పటిదాకా బోధనంతా ఫిన్నిష్, స్వీడిష్ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.
* పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్. హైస్కూల్ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుని నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.
అదే తేడా!
‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ డెవలప్‌మెంట్’ అనే సంస్థ మూడేళ్లకోసారి ప్రపంచస్థాయిలో లెక్కలూ, సైన్స్‌లాంటి వివిధ అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓ పరీక్ష నిర్వహిస్తుంది. నాలుగేళ్ల క్రితం ఆ పోటీలో పాల్గొన్న భారత్‌కు చివరి నుంచి రెండో స్థానం దక్కింది. దాంతో తరవాతి పరీక్షలో భారత్ పాల్గొనలేదు. అదే పోటీలో ఫిన్లాండ్ ఎన్నో ఏళ్లుగా నిలకడగా తొలి స్థానాన్ని సాధిస్తోంది. అక్కడి తలసరి ఆదాయంలో ఏడు శాతాన్ని చదువుపైన ఖర్చు చేస్తుంటే, భారత్‌లో 3.3శాతాన్నే ఖర్చుచేస్తున్నారు. అక్కడ హైస్కూల్ టీచర్ల సగటు నెలసరి ఆదాయం రెండున్నర లక్షలు. ఇక్కడది రూ.31వేలు. అక్కడ నెలరోజుల్లో చెప్పే పాఠాల్ని, ఇక్కడ వారంలోనే ముగిస్తున్నారు. ఇలా ఎన్నో అంశాల్లో భారత్‌లాంటి అనేక దేశాలతో ఫిన్లాండ్‌కి ఉన్న స్పష్టమైన తేడాలే, ఆ దేశ విద్యా వ్యవస్థని తిరుగులేని స్థానంలో నిలబెట్టాయి.
నలభై ఐదేళ్ల క్రితం...
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. 1970 వరకూ అక్కడి విద్యావ్యవస్థ నాసిరకంగా ఉండేది. సహజ వనరుల లభ్యతా తక్కువే. అలాంటి పరిస్థితుల్లో దేశం ముందుకెళ్లాలన్నా, ఇతర దేశాలతో సమానంగా ఎదగాలన్నా చదువుకున్న పౌరులే కీలకమని నాటి ప్రభుత్వ పెద్దలు నమ్మారు. డబ్బున్న వాళ్లంతా పిల్లల్ని మంచి స్కూళ్లకు పంపిస్తున్నారనీ, సామాన్యులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారనీ అర్థం చేసుకున్నారు. దాంతో ఎనభయ్యో దశకం తొలినాళ్లలో ప్రక్షాళన మొదలుపెట్టారు. దేశ విద్యా వ్యవస్థనంతా ప్రభుత్వం తన అధీనంలోకే తీసుకొని, ప్రైవేటు విద్యాసంస్థల్ని రద్దు చేసింది. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ సమానమైన విద్యను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. అలా గత నలభై ఐదేళ్లుగా విద్యా ప్రమాణాల్లో ఎన్నో మైలురాళ్లను దాటి, విద్యార్థుల సామర్థ్యం విషయంలో అగ్రరాజ్యాలనూ వెనక్కునెట్టి దూసుకెళ్తొంది. ప్రభుత్వం, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం, ఒకరిపైన ఒకరికి సంపూర్ణ నమ్మకం ద్వారా సాధ్యమైన విజయం.
మనకీ కొత్త విద్యాసంవత్సరం మొదలవుతోంది. కోటి ఆశలతో లక్షలాది పిల్లలు బడిబాట పడుతున్నారు. వాళ్ల చదువులు కూడా ఫిన్లాండ్ విద్యార్థుల చదువులంత హాయిగా సాగాలంటే, మన ఆలోచనలూ అక్కడి తల్లిదండ్రులూ ఉపాధ్యాయుల ఆలోచనలంత ఉన్నతంగా మారాలి. మన ప్రభుత్వాలూ అక్కడి విధానాల్లో కొన్నింటినైనా ఆచరణలోకి తేవాలి. పిల్లల నుంచి ఆశించడం మానేసి, వాళ్లని అర్థం చేసుకోవడం మొదలుపెడితే చాలు, ఉత్తమ ఫలితాలు వాటంతట అవే వస్తాయనడానికి ఫిన్లాండ్ విజయాలే సాక్ష్యం. ఆ దేశంలో పరీక్షల విధానం లేకపోవచ్చు. కానీ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడమన్నది ఏ దేశానికైనా పెద్ద పరీక్షే. అందులో ఫిన్లాండ్‌కి మరో ఆలోచన లేకుండా వందకి వంద మార్కులూ వేయాల్సిందే..!